హైదరాబాద్, వెలుగు: రైతులు తమకు అవసరమైన వ్యవసాయ పనిముట్లను నచ్చిన కంపెనీ నుంచి కొనేలా యాంత్రీకరణ పథకాన్ని అమలు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. శుక్రవారం శాసనమండలిలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. యంత్ర పరికరాల కొనుగోలుపై వచ్చే సబ్సిడీని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పారు. నాణ్యత, ప్రమాణాలు కలిగిన పరికరాలను మాత్రమే రైతులకు అందిస్తున్నామని తెలిపారు. కేంద్ర గుర్తింపు పొందిన సంస్థల్లో పరీక్షించిన యంత్రాలనే పథకం కింద ఎంపిక చేస్తున్నామని చెప్పారు.
పరికరాల ఎంపికలో రైతులకు భాగస్వామ్యం కల్పించామని, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, ఆదర్శ రైతులు, ఎఫ్‌పీవోల ప్రతినిధులతో ఎంప్యానెల్మెంట్ కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.147.91 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. చిన్న, సన్నకారు, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు 50 శాతం, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీ అందిస్తున్నామని చెప్పారు. రైతుల డిమాండ్‌కు అనుగుణంగా డ్రోన్లతో పాటు ఆధునిక యంత్ర పరికరాలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు
